Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 8:05 pm Posted by : ramakrishna

సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించి బెల్లం కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించాలి

 

. . . చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మూతపడిన ఎన్ సిఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి, దానిని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో జిల్లా వాసి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ, ఒకప్పుడు లాభాలతో నడిచిన ఎన్ సిఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ వల్ల రైతులు గణనీయమైన ఆర్థిక లాభాలు పొందారని చెప్పారు. రైతుల పిల్లల విద్య, గృహ నిర్మాణం, వివాహాలు వంటి అనేక అవసరాలకు ఈ ఫ్యాక్టరీ ఆదాయ వనరుగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ చక్కెర విధానాలు, అవినీతి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లి మూతపడిందని ఆరోపించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ ప్రాంతంలోని సుమారు 80 గ్రామాల రైతులు తిరిగి చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విత్తనాలు అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో విత్తన ఉత్పత్తికి అనుకూలమైన నేలలు ఉన్నాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని, శనగ, వేరుశెనగ, సోయాబీన్, వరి తదితర పంటల విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించాలని, అలాగే గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసిన విత్తనాల బకాయిలు సుమారు రూ.450 కోట్లను వెంటనే సంబంధిత సంస్థకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో లక్షలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయని, పచ్చిమేత అభివృద్ధి కోసం గతంలో ఉన్న వెటర్నరీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) పోస్టును పునరుద్ధరించి నియామకం చేపట్టాలని కోరారు. అలాగే పాడి రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అదేవిధంగా పులాంగ్ వాగు అభివృద్ధిలో భాగంగా మాసాని నుంచి పాల్ద, జన్నేపల్లి వరకు వాగుకు ఇరువైపులా కరకట్టలు నిర్మిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్యతో పాటు నాయకులు కొట్టే గంగాధర్, టేక్మాల్ లక్ష్మణ్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.