. . . వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల, బతుకమ్మ :
వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కొనడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం, బద్దెనపల్లి గ్రామంలో శనివారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల నుంచి కొనుగోలు సెంటర్ కి వడ్లు తీసుకొస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క గింజ కూడా కొన్న పాపాన పోలేదని, రైస్ మిల్ కేటాయించపోతే.. ధాన్యాన్ని ఎవరు కొనాలి? ఎలా తూకం వేయాలని ప్రశ్నించారు. దళారులకు అప్పగిస్తే వాళ్ళు కమీషన్ ఇస్తారని, అందుకే వదిలేశారని, రైతుబంధు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో అధికారులను అడిగితే రూ. 1000 క్వింటాలు కూడా కొనలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అకాల వర్షం పడి ధాన్యం తడిసిపోతుందని రైతులు టార్పాలిన్ కవర్లు కొనుక్కుని కప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాది రైతు ప్రభుత్వం అని రాహుల్ గాంధీ చెప్తున్నారని, కానీ ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంత దరిద్రపు పాలన లేదని, నేను సిరిసిల్ల వస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా లేడని, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. లేదంటే మేము రోడ్డెక్కుతామని, అందరు రైతులను కలుస్తామని అన్నారు. రెండేళ్లు ఆగండి. మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఆ తరవాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామి ఇచ్చారు.
