. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం సమీపంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు శనివారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు. 2027 నాటికి భారతీయ పరిశ్రమల సమాఖ్య (ఎఫ్ఐసిసిఐ) వందేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. హైటెక్ సిటీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) కార్యాలయం మధ్యలో ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతానికి మరింత ప్రత్యేక గుర్తింపు వస్తుందని అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఎఫ్ఐసిసిఐ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఎఫ్ఐసిసిఐ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను నెలకొల్పాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమవుతుందని చెప్పారు. ఎఫ్ఐసిసిఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో, మహిళా సాధికారత కోసం మరో పారిశ్రామిక పార్క్ అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి మహిళా పారిశ్రామికవేత్తల సమస్యలు, పురోగతిపై సమీక్షిస్తామని చెప్పారు. వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తున్న మహిళా సంఘాలను ఎఫ్ఐసిసిఐ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అవార్డులతో సత్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్, ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్‌పర్సన్ సీతా రెడ్డి గడ్డం తదితరులు పాల్గొన్నారు.
