నిజామాబాద్, బతుకమ్మ : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుందని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించిన రెండో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెలలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి 17 సెప్టెంబర్ 1948 న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్థాయిలో, పట్టణ ప్రాంతాలలో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని సమస్యలు పరిష్కరించుట గురించి, ప్రజలకు సుపరిపాలన అందించుటకు, పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకవెళ్ళి, సమస్యల పరిష్కారమునకు ప్రభుత్వం ప్రజాపాలన అనే కార్యక్రమానికి స్వీకారం చుట్టిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో వానాకాలం 2025 సంవత్సరం ఇప్పటి వరకు వరి 4 లక్షల 37 వేల ఎకరాలు, మొక్క జొన్న 52 వేల ఎకరాలు, సోయా చిక్కుడు 34 వేల ఎకరాలు, పసుపు 24 వేల ఎకరాలు మొత్తం 5 లక్షల 47 వేల ఎకరాలలో రైతులు పంట సాగు చేస్తున్నారన్నారు.
