. . . కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్
. . . బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ చేపడతాం
. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అమలుకాలేదని, అది “జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్‌లెస్ క్యాలెండర్” గా మారిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని కేటీఆర్ అన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ చేపడతామని హామీ ఇచ్చారు. ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లు చెబుతున్న “క్రిమినల్ వేస్ట్” వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇంజనీర్లు రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించారని, హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి నిర్మాణాలు ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఇంజనీర్లను కూడా అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలపై స్పందిస్తారని, కానీ తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా రాహుల్ స్పందించలేదని అన్నారు. రాష్ట్రంలో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించిన కేటీఆర్, అసెంబ్లీలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, విద్యా హక్కు చట్టం అమలు, గురుకులాల పరిస్థితి, ఐటీ రంగంలో ఉద్యోగాల తగ్గుదల వంటి అంశాలపై కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో టెక్నాలజీ రంగ ఉద్యోగాలు తగ్గిపోయాయని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. వ్యవసాయ రంగంపై మాట్లాడుతూ, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, రైతులకు నీరు అందించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు. మెట్రో ప్రాజెక్టు నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాధన వినియోగంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వెనుక అవినీతి ఉందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే వారిపై వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
