Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 6:25 pm Posted by : ramakrishna

శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే పోలీసుల లక్ష్యం

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీస్ కమిషనర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి వివిధ రకాల ఫిర్యాదులకు సంబందించిన 30 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకుని, పరిష్కారానికి తగు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని వారు కోరారు. ప్రజా సమస్యలు పై నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని, వారి వారి సమస్యలను చట్ట ప్రకారమే పరిష్కరించుకోవాలని ఆయన తెలియజేశారు.