- రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి.బాలకృష్ణారెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచంతో పోటీపడే విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి.బాలకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్తంగా “వికసిత్ భారత్ @ 2047 ట్రాన్సోర్మటివ్ రోల్ అఫ్ కామర్స్” అనే అంశం పై జరిగిన జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన విశిష్ఠ అతిథిగా హాజరై మాట్లాడారు. 21వ శతాబ్దంలో సాంకేతిక విప్లవంతో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ తో పాటు ఉపాధి అవకాశాలుండే విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాలన్నారు. ఆధునిక భారతావనిలో వాణిజ్యశాస్త్ర అభివృద్ధి వేగం పుంజుకుందని పేర్కొన్నారు. వస్తు మార్పిడి పద్ధతి మొదలుకొని గ్లోబలైజేషన్ లిబర్లైజేషన్ దాటి ఈనాటి డిజిటలైజేషన్ వరకు వెళ్ళిందన్నారు. ఈ క్రమంలో పెట్టుబడులకు ఎల్లలు లేకుండా బహుళ జాతి కంపెనీలు ఉత్పాదకతను ఉత్పత్తిని పెంచుకుంటూన్నాయన్నారు. వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో కో-ఆపరేటివ్ ఫెడరలిజం వలన అవినీతి తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సెమినారు వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుందన్నారు. అనేక ఆవిష్కరణలకు, సవాళ్లకు పరిష్కారం చూపుతుందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం. యాదగిరి, మాట్లాడుతూ భారత దేశాభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రమాణాలతో ముందుకు పోతూ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విస్తరించిందని పేర్కొన్నారు. అతిథులుగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ఆచార్య ఎస్. శ్రీనివాసమూర్తి తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య పి. పురుషోత్తమరావు, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆచార్య చెన్నప్ప, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆచార్య రవికుమార్ జాస్తి, డాక్టర్ గంగాధర్, రాజు, బికోజి, తెలంగాణ విశ్వవిద్యాలయ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
