. . . సర్పంచ్ రోహిత్ గౌడ్
ఇందల్వాయి, బతుకమ్మ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని దొనకల్ గ్రామ సర్పంచ్ రోహిత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శనివారం “ప్రైవేట్ పాఠశాలలు వద్దు – ప్రభుత్వ పాఠశాలలే ముద్దు” అనే నినాదంతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామంలోని తండాలు, కాలనీలలో పర్యటిస్తూ ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై అధిక ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక వసతులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, తల్లిదండ్రులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.