. . . డివిజన్ 30, 33లో మేయర్ ఉమారాణి, కమిషనర్ దిలీప్ కుమార్ విస్తృత పర్యటన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగర ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారాలు చూపించాలనే లక్ష్యంతో నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం నగరంలోని 30వ, 33వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. కాలనీల్లో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనులపై అభిప్రాయాలను సేకరించారు. పర్యటన సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, రోడ్ల పరిస్థితి, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఈ సందర్భంగా మేయర్ ఉమారాణి మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్ సమానంగా అభివృద్ధి చెందడమే నిజమైన నగరాభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన పౌర సేవలు అందించేందుకు నగర పాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అలాగే, ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్, ఏఎంసీ నజీర్, ఏఈ ఇనాయత్ కరీం, మున్సిపల్ జవాన్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
