. . . పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోయిన అనిల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోయిన అనిల్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థి ప్రదర్శనను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్క గణేష్, ఎల్. అనిల్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు ఇప్పటికీ ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లు, కాస్మెటిక్ చార్జీలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను విరమించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యను హక్కుగా కాకుండా భారంగా చూస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం తగదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లు, కాస్మెటిక్ చార్జీలు, బీఎఎస్ బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యార్థుల అన్ని సమస్యలను పరిష్కరించకపోతే, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ప్రభుత్వ వైఖరిని పీడీఎస్‌యూ ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, జిల్లా సహాయ కార్యదర్శి సృజన్, జిల్లా నాయకులు మున్నా, రేహాన్, హేమాంజలి, శ్రీశాంత్, మణితేజ, రెహాన్, అమర్, కుమార్, పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.