Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 6:30 pm Posted by : ramakrishna

మీ సేవ సమస్యలకై ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోంది

 

. . . జిల్లా మీసేవ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సితారే క్షవీన్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మీసేవ నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు బైర శంకర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు సితారే క్షవీన్ రాజ్, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ సాహిద్ అలీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో మీసేవ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. మీసేవ కమిషన్ల పెంపుపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, కమిషనర్‌కు ప్రతీకాత్మకంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కమిషన్ పెంపు సానుకూల నిర్ణయమని పేర్కొంటూనే, మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో జనాభాకు మించిన మీసేవ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. సుమారు ఎనిమిది జిల్లాల్లో ఈ పరిస్థితి కొనసాగుతున్నందున, కొత్త మీసేవ కేంద్రాలకు తాత్కాలికంగా అనుమతులు లేవు. అలాగే నిజామాబాద్ జిల్లాకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు సితారే క్షవీన్ రాజ్ మాట్లాడుతూ కమిషన్ పెంపు ఉద్యమ ఫలితమని పేర్కొన్నారు. మీసేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని, వాటి పరిష్కారం వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ మీసేవ ఫెడరేషన్ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర కమిటీ రాకతో నిజామాబాద్ జిల్లా మీసేవ ఫెడరేషన్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మీసేవ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

The Federation is constantly working to address your service issues.