. . . చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
సారంగాపూర్ ఎన్ సిఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీ గురువారం ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించనున్న రైతు సమ్మేళనాన్ని రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. సోమవారం సాయినగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో చెరుకు కూడా ఆరుతడి పంటేనని పేర్కొన్నారు. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తే, రైతులంతా చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోని 117 గ్రామాల రైతులకు చెరుకు సాగు చేసిన అనుభవం ఉందని చెప్పారు. ప్రస్తుతం రెండో పంటగా చెరుకు సాగు చేసేందుకు సుమారు 40 గ్రామాల రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉన్నందున సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నిర్వహించాలని పాపయ్య డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు చక్కెర ఫ్యాక్టరీలను పునఃప్రారంభిస్తామని హామీలు ఇచ్చి రైతులను మోసం చేశాయని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల బాటలో నడవకుండా రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కోరారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం రైతులంతా ఐక్యంగా బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 13న జరిగే రైతు సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణ, బాధ్యతలపై తగిన ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పాపయ్య కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, సిర్పూర్ గంగారెడ్డి, కొట్టే గంగాధర్, టేక్మాల్ లక్ష్మణ్, తుంగపల్లి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.