నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ప్రైవేట్ ఇంటర్ కాలేజీల దుర్మార్గాలను అరికట్టాలని టిజీవీపీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యాధికారికి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు రాకముందే కొన్ని ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు ముందుగానే అడ్మిషన్లు ప్రారంభించి, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థులు విశ్రాంతి కోల్పోయి, ఒత్తిడితో చదువుపై మనస్సు నిలుపలేని స్థితికి చేరుతున్నారని అన్నారు. ఇంతటితో ఆగకుండా, అడ్మిషన్ పేరుతో తల్లిదండ్రులపై అధిక మొత్తంలో ఫీజులు వేసి, గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసేశాం అని తదుపరి కాలేజీ మారే అవకాశాన్ని కోల్పోయేలా చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఈ చర్యలు విద్యా రంగాన్ని వ్యాపారంగా మలుచే దురుద్దేశంతో కొనసాగుతున్నాయన్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్ ఫీజులు వసూలు చేసే కళాశాలలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డి ఐ ఈ ఓ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్యకర్తలు నిఖిల్, వినయ్, దేవేందర్ తదుతరులు పాల్గొన్నారు.