Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:59 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ వివరాల నమోదును నిశితంగా పరిశీలించాలి

 

. . . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఏఈఆర్ఓ లు, సూపర్వైజర్లు నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ బీఎల్‌వోలు వెబ్‌సైట్‌లో ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో అనేక పొరపాట్లు జరిగినట్లు గుర్తించామని, వాటి కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అందువల్ల బీఎల్‌వోలు నమోదు చేసిన ప్రతి వివరాన్ని ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా క్రాస్ వెరిఫై చేయాలని, లోపాలను గుర్తిస్తూ వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. అనవసర తప్పిదాలకు ఆస్కారం కల్పిస్తే సంబంధిత బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉందని, సూపర్‌వైజర్లు బీఎల్‌వోలతో నిరంతరం సమన్వయం చేసుకొని పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే అన్ని స్థాయిల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ పురోగతి గురించి తెలియజేయాలని అన్నారు. గైర్హాజరు, మృతి చెందిన, వలస వెళ్లిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను వచ్చే శనివారం వరకు పూర్తి చేయాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించామని తెలిపారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా సెగ్మెంట్లలో వివరాల నమోదు ప్రక్రియను పునః పరిశీలన జరిపిస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

The entry of SIR details must be scrutinized closely.