ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల బాకీ కార్డుల పేరుతో గ్రామాలలో తప్పుడు విధానాలకు తెరతీసారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో ఎన్నో వాగ్దానాలు చేసి మరిచిపోవడం జరిగిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి,దళిత బంధు విద్యార్థుల ఫీజు,రియంబర్స్మెంట్ దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేయడం మోసపూరిత వాగ్దానాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఆరు గ్యారంటీలలో నాలుగు నెరవేర్చడం జరిగిందని, ఇంకా రెండు గ్యారెంటీలను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే హామీలు ఇవ్వకున్నా రైతు రుణమాఫీ, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను చేపట్టామన్నారు.మా ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాలు కాలపరిమితి ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డు పేరుతో స్థానిక ఎన్నికల నేపథ్యంతో గ్రామాలలో తిరుగుతున్నారని అన్నారు. అన్నిటికంటే బిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు వేములవాడ రాజరాజేశ్వరునికి ఏటా 100 కోట్లు ఇస్తానని వాగ్దానం చేసి ఆ హామీని నెరవేర్చకపోవడం అన్యాయమన్నారు.దేవుడిని మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాధారణ ప్రజలను మోసం చేయడం వారికి పెద్ద లెక్క కాదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగం,వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు షేక్ గౌస్,చెన్ని బాబు, మెండే శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, కదిరి శ్రీనివాస్ గౌడ్, ముక్క శంకర్, దేవేందర్ యాదవ్, జంకెలచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.