- తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం 71 వేల 306 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను, 2 వేల 423 క్వింటళ్ల జీలుగు విత్తనాలను, 1 వేయి 495 క్వింటాళ్ల వరి ధాన్యం విత్తనాలను పంపిణీ చేయటం జరిగింది. రైతు భరోసా సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలకు పెంచడం జరిగింది. ప్రస్తుత వానా కాలం గురించి 3 లక్షల 3 వేల 568 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 305 కోట్ల 98 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. ప్రభుత్వం జిల్లాలో 1 లక్ష 96 వేల 554 మంది రైతులకు బీమా కలిగించింది. ప్రస్తుతం రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించుటకు 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో మండలానికి 3 చొప్పున 72 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌఖర్యాన్ని కల్పించి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది.
పౌర సరఫరా:-
అర్హులైన వారందరికి నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో కొత్తగా 15 వేల 302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా 48 వేల 971 మంది కుటుంబ సభ్యులను వారికి సంబంధించిన రేషన్ కార్డులలో జత చేయడం జరిగింది. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2 లక్షల 56 వేల 732 రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయటం జరుగుచున్నది. 500/- రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1 లక్ష 50 వేల 131 మంది వినియోగదారులకు 5 లక్షల 58 వేల 981 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 16 కోట్ల 5 లక్షల రూపాయల సబ్సిడీ అందించింది.
వరి ధాన్యం కొనుగోలు:-
గత యాసంగిలో 3 లక్షల 82 వేల 555 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 446 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. అంతేకాదు 887 కోట్ల 53 లక్షల రూపాయలను 73 వేల 640 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి:- ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాలలో 12 వేల 905 యూనిట్లను, 169 కోట్ల 29 లక్షల రూపాయల పెట్టుబడితో మరియు పట్టణ ప్రాంతాలలో 154 యూనిట్లను, 5 కోట్ల 89 లక్షల రూపాయల పెట్టుబడితో వివిధ రకాల వ్యాపార సంస్థలను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం యూనిఫాం దుస్తులు కుట్టించినందుకు గాను మహిళా సంఘాలకు 1 కోటి 16 లక్షల రూపాయలు ఆదాయం లభించింది’’ అని అన్నారు.
