Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:42 pm Posted by : ramakrishna

దేవి మందిర్ ను ప్రాచీన కాలం నాటి ‘’నల్ల పోచమ్మ ఆలయంగా’’ పిలవాలి

 

. . . ఆలయాన్ని సందర్శించిన సర్వసమాజ్ కమిటీ బృందం..

 

. . . నల్ల పోచమ్మ ఆలయం పేరిట సైన్ బోర్డు ఏర్పాటు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇందూరులో గ్రామ దేవతల ఆలయాల పేర్లు మారినట్టు చరిత్రలో లేదు. కానీ ప్రాచీన కాలం నాటి నల్ల పోచమ్మ తల్లి దేవాలయం పేరును మాత్రం నార్త్ ఇండియన్స్ నుండి వలస వచ్చిన కొందరు మార్వాడీ వ్యాపారస్తులు మాత్రం ఆ పేరును కాస్త మార్చేశారు. ఆలయ ట్రస్టీలమంటూ చెలామణి అవుతూ సదరు వలసవాదులు నల్ల పోచమ్మ గుడి గ్రామదేవత పేరును దేవి మందిర్ గా మార్చారు. కానీ పాత కాలం వారంతా ఈ గుడిని నల్ల పోచమ్మ తల్లి గుడిగానే పిలుస్తున్నారు. అయితే కొంత మంది భక్తులు నల్ల పోచమ్మ గుడి పేరుతో సైన్ బోర్డు పెట్టేందుకు ప్రయత్నించగా ఆ పేరును పెట్టొద్దని ట్రస్ట్ మెంబర్లు అడ్డుపడి మొండిగా వ్యవహరిస్తున్నారు. అయితే నాటి కాలం నుండి గ్రామదేవతల ఉత్సవాలు వాటి నిర్వహణను ఇందూర్ సర్వసమాజ కమిటీ చూస్తోంది. ఈ విషయాన్ని భక్తులు వారి దృష్టికి తీసుకెళ్లగా..నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్ లో గల ప్రాచీన నల్ల పోచమ్మ దేవాలయాన్ని మంగళవారం సర్వసమాజ్ కమిటీ ప్రతినిధి బృందం సందర్శించారు. ఆగస్టు 2 వ తేదీన ఆదివారం నగరంలో నిర్వహిస్తున్న ఊర పండుగను పురస్కరించుకుని శ్రీ నల్ల పోచమ్మ ఆలయం ప్రాంగణంలో భక్తులు అరవింద్ ఎం,అవన్ కుమార్ లు స్వంత ఖర్చులతో డొనేట్ చేసిన నల్ల పోచమ్మ దేవాలయం పేరిట గల సైన్ బోర్డును సర్వ సమాజ్ కమిటీ సభ్యులు దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక మీదట ఈ దేవాలయాన్ని నల్ల పోచమ్మ దేవాలయంగా పిలవాలని సర్వసమాజ్ కమిటీ సెక్రటరీ బంటురాజేశ్వర్, కన్వీనర్ రామర్తి గంగాధర్, ఆదే ప్రవీణ్, కౌడపు శరత్ లు, బంటు గణేష్, లక్ష్మణ్ లు భక్తులను కోరారు.