. అంతా జిల్లా గిరిజన సంక్షేమ శాఖదే పెత్తనం
. అర్హుల గుర్తింపు నుంచి పట్టాలు ఇచ్చే వరకు సుమారు రూ.60లక్షల ఖర్చు
. డమ్మీగా మారిన రెవెన్యూశాఖ
. పర్యవేక్షణను పట్టించుకోని ఉన్నతాధికారులు
. అనర్హులకు పోడుభూముల పట్టాలిచ్చారనే ఆరోపణలు
. అంతర్గత విచారణకు ఆదేశించిన మంత్రి?
పోడు భూముల పట్టాల పంపిణీ ప్రక్రియలో అర్హుల గుర్తింపు నుంచి మొదలుకుని చివరి వరకు జిల్లా గిరిజన సంక్షేమశాఖ (డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్, డీటీడబ్ల్యూవో) అంతాతానై వ్యవహరించింది. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోడు పట్టాల పంపిణీ ప్రక్రియను రెవెన్యూశాఖ పర్యవేక్షించగా, నిజామాబాద్ జిల్లాలో ఆ శాఖ డమ్మీగా మారింది. క్షేత్రస్థాయిలో ఆర్ ఐ, పంచాయతీ కార్యదర్శి, సర్వేయర్, ఫారెస్ట్ బీట్ అధికారి సర్వే చేపట్టి అర్హులను గుర్తించి ఆ నివేదికను సబ్ డివిజనల్ కమిటీకి అందజేస్తే.. దానిని పరిశీలించిన తరువాత కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీకి సబ్ డివిజనల్ కమిటీ అందజేయాలి. నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఆ పద్దతికి మంగళం పాడారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖనే జిల్లా కమిటీకి అర్హుల జాబితాను అందజేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందని, అనర్హులకు అటవీభూములపై హక్కులిచ్చారని పలువురు గిరిజనులు ఆరోపిస్తున్నారు. అర్హుల గుర్తింపు, పట్టాల పంపిణీ కోసం గిరిజన సంక్షేమశాఖ రూ.60లక్షలకుపైగా ఖర్చు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నిజామాబాద్, బతుకమ్మ: గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలనే అప్పటి ప్రభుత్వ నిర్ణయం అధికారులకు వరప్రసాదంలా మారింది. అటవీ భూములను 2004 నుంచి సాగు చేస్తున్న గిరిజనులను గుర్తించి వారికి పట్టాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెవెన్యూ విభాగం పర్యవేక్షణ (మానిటరింగ్) చేస్తుండగా.. నిజామాబాద్ జిల్లాలో మాత్రం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ (డిస్ర్టిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్, డీటీడబ్ల్యూవో) పర్యవేక్షించడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అర్హుల గుర్తింపు నుంచి పోడు పట్టాల పంపిణీ వరకు ప్రతి వ్యవహారాన్ని ఆ శాఖ చూసినట్లే చూసి లక్షలాది రూపాయలను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలున్నాయి. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం, సంబంధిత మంత్రి దీనిపై సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.
పర్యవేక్షణ పరిహాసం
కింది స్థాయిలో మండల గిర్ధావర్ (ఆర్ఐ), పంచాయతీ కార్యదర్శి, సర్వేయర్, ఫారెస్ట్ బీట్ అధికారి సర్వే చేసి అర్హులైన గిరిజనులను గుర్తించి నివేదికను సబ్ డివిజనల్ కమిటీకి అందజేస్తారు. అయితే జిల్లాలో ఆ పద్ధతికి మంగళం పాడారు. సర్వే నివేదికలు డీటీడబ్ల్యూవో చెంతకు చేరడంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, ఆర్డీవోలు, డీటీడబ్ల్యూవోతోపాటు ఐదుగురి వరకు గిరిజనులు సభ్యులుగా కమిటీలో ఉంటారు. గ్రామ స్థాయిలో వచ్చిన నివేదికలు ముందుగా రెవెన్యూ డివిజనల్ అధికారి వద్దకు చేరితే, వారు జిల్లా కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ జిల్లాలో ఎక్కడా కనిపించలేదు.
ఇతర జిల్లాల్లో అంతా రెవెన్యూనే..
పోడు భూముల పట్టాల పంపిణీ ప్రక్రియను రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రెవెన్యూశాఖ పర్యవేక్షించింది. భూముల వ్యవహారాలకు సంబంధించి రెవెన్యూశాఖదే కీలకపాత్ర కావడంతో ఆయా జిల్లాల్లో పట్టాల పంపిణీ పారదర్శకంగా జరిగినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం రెవెన్యూశాఖను మానిటరింగ్ చేయాలని విన్నవించకుండా, గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణ చేయడం వెనుక మతలబు దాగి ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు అర్హలను పక్కనపెట్టి అనర్హులకు పోడు పట్టాలు ఇచ్చారని పలువురు పేర్కొంటున్నారు. రెవెన్యూ విభాగం పర్యవేక్షించి ఉంటే గిరిజన శాఖ ఆటలు సాగేవి కావంటున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే మానిటరింగ్ తమ ఆధీనంలోనే ఉండాలనే ఈ చర్యకు పూనుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం భూమిలేని పేద గిరిజనులకు భూమి ఇవ్వాలనే నిబంధనలను తుంగలో తొక్కేశారని కొంతమంది గిరిజనులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పట్టాల పంపిణీలో వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇచ్చినట్లు తెలుస్తోంది.
తప్పుల తడక
2004 నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులను గుర్తించి కలెక్టర్ (చైర్మన్) ఆధ్వర్యంలో పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే మన జిల్లాలో మాత్రం ఉద్యోగులు, భూములున్న వారికే మళ్లీ భూములు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. సుమారు 4200 పైచిలుకు మందికి పోడు పట్టాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పలువురు గిరిజనులకు ఓ చోట భూమిని సాగు చేసుకుంటే మరో చోట భూమి ఇచ్చారనే.. దీని వెనుక భారీ అవినీతి జరిగిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పోడు భూముల సర్వే మొదలుకొని పంపిణీ పూర్తయ్యే వరకు సుమారు రూ.60 లక్షల వరకు వ్యయం చేసినట్లు సమాచారం.
ఆరా తీస్తున్న మంత్రి
గిరిజనులకు భూ పంపిణీ విషయంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అవకతవకలపై గిరిజన శాఖ మంత్రి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ మానిటరింగ్ చేస్తే, ఇక్కడ సంబంధిత అధికారులు పర్యవేక్షించడంతోపాటు పట్టాల పంపిణీలో డబ్బులు చేతులు మారాయని జిల్లా నుంచి పెద్ద ఎత్తున మంత్రికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీనిపై మంత్రి అంతర్గతంగా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.