Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 8:15 pm Posted by : ramakrishna

సీఎం, రూరల్ ఎమ్మెల్యేల చేతగాని తనం వల్లే ఆర్ వోబి పనులు ఆలస్యం

 

. . . బహిరంగ చర్చకు సిద్దమా?

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ముఖ్యమంత్రి , రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేతగానితనం వల్లనే నిజామాబాద్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి విమర్శించారు. బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తమ ఎంపీ ధర్మపురి అర్వింద్ గురించి నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఖబర్దార్ అని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఎంపీ అర్వింద్  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన తర్వాత రూ. 9 కోట్లు రిలీజ్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపిస్తే ఫైల్ ఇంకా పెండింగ్ లో ఉంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే అర్వింద్ భిక్షాటన చేశారని ఆ భిక్షాటన చేసింది కూడా మీ చేతగాని ముఖ్యమంత్రికే ఇవ్వడానికేనని అన్నారు. నీలాగా ఇటుక బట్టీలు, మొరం క్వారీలు, ఇసుక క్వారీల వద్ద వసూళ్లు చేయడానికి అడుక్కుంటలేడని భూపతిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. నువ్వు చేసిన నిరాధార ఆరోపణలపై నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు ఎక్కడికి వస్తావో చెప్పు ప్రెస్ క్లబ్‌కు వస్తావా లేక రైల్వే బ్రిడ్జి వద్దకే వస్తావా లేదా కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి పనులను ఆపిందని రుజువు చేసే డాక్యుమెంట్లు తీసుకొనిరా అని సవాల్ విసిరారు. నీ అవినీతి చరిత్ర మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షులను అడిగితే పూసగుచ్చినట్లు చెబుతారన్నారు. సొసైటీ చైర్మన్ పదవులను రూ. 15 లక్షలకు అమ్ముకున్నావని, డబ్బులిచ్చిన వారికే పార్టీ పదవులు కట్టబెడుతున్నావని మీ సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చెబుతున్నారన్నారు. నీ పేరు చెప్పుకుని మీ కార్యకర్తలు ఇటుక బట్టీల దగ్గర ఒక్కో ఇటుకకు రెండు రూపాయలు, ఒక్కో మొరం లారీకి వెయ్యి రూపాయలు, ఇసుక లారీకి ఐదు వేల రూపాయలు లెక్కన వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో అత్యంత చెత్త, అవినీతిమయ, వరస్ట్ శాసనసభ్యుడివి నువ్వే భూపతిరెడ్డి అని అన్నారు. ఈ విలేకరుల సమావేశలో దంపల్లి జ్యోతి, ఎర్రం సుదీర్, పద్మరెడ్డి, బొబ్బిలి వేణు, అమంద్ విజయ్ కృష్ణ, ఇప్పాకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బద్దం కిషన్, మల్లేష్ యాదవ్, పురుషోత్తం, జగదీష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.