Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 6:57 pm Posted by : ramakrishna

మినహాయించిన 1.5 శాతం వేతనాన్ని వెంటనే జమ చేయాలి

 

. . . టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

హెల్త్ కార్డులు జారీ చేయకుండా, టీచర్ల సమ్మతి తీసుకోకుండా మినహాయించిన 1.5 శాతం వేతనాన్నీ ఉద్యోగుల ఎకౌంటుకు వెంటనే జమ చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంప్లాయిస్ ఆరోగ్య పథకం కోసం ఉద్యోగుల మే నెల వేతనం నుండి 1.5 శాతం మినహాయిస్తూ పే స్లిప్స్ జనరేట్ చేశారన్నారు. ఆరోగ్య పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించకుండా, కనీసం డ్రాయింగ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం దొడ్డిదారిన ఉద్యోగుల వేతనం నుండి 1.5 శాతం మినహాయింపు చేయడాన్ని టిపిటిఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఏ హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నారనే స్పష్టత లేదని, భార్యాభర్తలు ఉద్యోగులైన సందర్భాలలో, తల్లిదండ్రులు ఉద్యోగులైన సందర్భాల్లో, వేతన మినహాయింపులు ఏ విధంగా చేస్తారనే నిబంధనలు రూపొందించకుండానే ప్రతి ఉద్యోగం నుండి మినహాయింపు చేశారని, ఇది అక్రమమైన చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే 1.5 శాతం వేతనాన్ని ఉద్యోగుల అకౌంట్ లో జమ చేయాలని లేనట్లయితే ప్రభుత్వ అసంబద్ధ విధానాల పైన టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.