. విద్యా సంస్థ నిర్లక్ష్యం ఏమీ లేదు
. తల్లిదండ్రులు వచ్చే వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు
. విలేకరుల సమావేశంలో కాకతీయ డైరెక్టర్ రజినీకాంత్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తమ విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి విద్యార్థి శివ జశ్విత్ రెడ్డి మృతి బాధాకరమని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజినీకాంత్ అన్నారు. విద్యార్థి మృతి ఘటనపై ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడడంతోపాటు జశ్విత్ రెడ్డి మృతి చెందడానికి ఒక రోజు ముందు నుంచి ఘటన చోటు చేసుకునే వరకు దినచర్యను, సీసీ ఫుటేజీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జశ్విత్ రెడ్డి రోజూలాగే తోటి విద్యార్థులతో హుషారుగా ఉన్నాడని, గురువారం ఉదయం అందరితోపాటు 6గంటలకు నిద్రలేచిన అతడు టిఫిన్ చేయడంతోపాటు క్లాస్ లకు హాజరయ్యాడని, వాలీబాల్ ఆడాడని తెలిపారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు స్టడీ అవర్స్ ప్రారంభం కాగా, 7.45గంటలకు జశ్విత్ బెడ్ షీట్ వెంట తీసుకురావడంతో ఉపాధ్యాయుడు ప్రశ్నించగా చలిగా ఉందని సమాధానం ఇచ్చాడన్నారు. వెంటనే సదరు ఉపాధ్యాయుడు మరో ఇద్దరు విద్యార్థులను తోడుగా జశ్విత్ ను రూమ్ కి పంపించాడని, రాత్రి 11 నుంచి 12గంటల మధ్య వాంటి చేసుకోవడం తోటి విద్యార్థులు వచ్చి అక్కడే ఉన్న ఉపాధ్యాయుడికి తెలిపారన్నారు. ఉపాధ్యాయుడు వామిడెక్స్-ఎండీ టాబ్లెట్ తోపాటు ఓరల్ ప్యాకెట్ తాగించినట్లు తెలిపారు. ఆ తరువాత విశ్వజిత్ నిద్రపోగా ఉపాధ్యాయుడు ఒంటి గంటకు వెళ్లి మళ్లీ అడుగగా సమస్యేమీ లేదని సమాధానమిచ్చాడన్నారు. శుక్రవారం ఉదయం 7.30గంటలకు తనకు టిఫిన్ దోశ కావాలని కోరగా, ఉపాధ్యాయుడు బయటి నుంచి తీసువచ్చి ఇచ్చాడని తెలిపారు. 7.48 గంటలకు తన తల్లిదండ్రులతో మాట్లాడిన జశ్విత్.. తనకు పాలు తాగాలని లేదని తెలిపాడన్నారు. అక్కడే ఉన్న టీచర్ ఆస్పత్రికి తీసుకు వెళ్తానని అనగా, తన తల్లిదండ్రులు 9.30గంటల వరకు వస్తారని, వారితోపాటు వెళ్తానని జశ్విత్ అన్నాడన్నారు. 9.50గంటలకు తల్లిదండ్రులు రాగా.. పై ఫ్లోర్ నుంచి కిందికి దిగుతున్న జశ్విత్ నడవలేక అక్కడే కూర్చున్నాడని తెలిపారు. వెంటనే జశ్విత్ ను అతడి తల్లిదండ్రులతోపాటు తమ విద్యా సంస్థ సిబ్బంది జశ్విత్ ప్రతిభ ఆస్పత్రికి తీసుకెళ్లి జాయిన్ చేసినట్లు తెలిపారు. ఆ తరువాత జశ్విత్ కన్నుమూశాడని, ఇందులో విద్యా సంస్థ నిర్లక్ష్యం లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. పోలీసులతోపాటు మీడియాకు సీసీ ఫుటేజీని అందజేస్తామన్నారు.

