Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 12:08 pm Posted by : ramakrishna

బీజేపీలో టికెట్లు నిర్ణయించేది కోర్ కమిటీనే

నిజామాబాద్, బతుకమ్మ :  గత కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా తయారైంది. స్థానిక ఎన్నికలు ఈనెల చివరి నాటికి జరిగే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్టే భారతీయ జనతా పార్టీలో టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఏర్పడింది. కాగా కొంతమంది   జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు,  కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహులు ఎవరికి వారే తమ నియోజకవర్గ నాయకుల దగ్గర టికెట్ ఇప్పించాలని కోరుతున్నారట. దానికి తగ్గట్టే కొంతమంది నాయకులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తమ తమ అనుచరులకు టికెట్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తీరా ఈ వ్యవహారం అంతా పార్టీ పెద్దల చెవిలో పడింది. క్రమశిక్షణకు మారుపేరైన భారతీయ జనతా పార్టీలో టికెట్ల ఎంపిక ప్రక్రియ ఏ ఒక్క నాయకుడికీ లేదని వారు స్పష్టంగా చెప్పేశారట. వ్యక్తిగతంగా ఎవరికి కూడా టికెట్లు ఇచ్చే అధికారం భారతీయ జనతా పార్టీలో లేదని, జిల్లా కోర్ కమిటీ ఆశావాహల జాబితా తయారు చేస్తుందని, దానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం మేరకే టికెట్లు దక్కుతాయని జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేత తెలియజేశారు. దీంతో ఈ టికెట్ నీకే అని అభయమిచ్చిన కొన్ని నియోజకవర్గాల నేతల పరిస్థితి అగమ్యగోచరమైంది.