. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ అధ్యక్షతన విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వేలాది మంది విద్యార్థులు చదువును కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అప్పులు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం మానుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై బీజేవైఎం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. సంతకాల సేకరణ ద్వారా విద్యార్థుల గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో – కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు విపుల్ రావు, రాకేష్, రాజ్ గణేష్, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఓం సింగ్, బీజేవైఎం నాయకులు సాయి ప్రవీణ్తో పాటు పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
