. . . ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి
. . . ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాందేవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అడ్డుపెట్టుకుని లక్షల రూపాయల ఫీజులు, డొనేషన్లు, ప్రత్యేక చార్జీల పేరుతో దోపిడీ కొనసాగిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి విద్యాసంస్థ ఫీజు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచే విధానం తీసుకురావాలని కోరారు. అలాగే అనుమతులు లేని పాఠశాలలు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటేనే ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. విద్య హక్కు కానీ వ్యాపారం కాదని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే ఆర్ఎస్ పి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ పి పార్టీ నాయకులు పిట్ల నరేష్, సునిల్ లు పాల్గొన్నారు.