Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 7:06 pm Posted by : ramakrishna

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసా

 

. . .  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప భరోసాగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, ఆపద సమయంలో వారికి అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే సీఎంఆర్‌ఎఫ్ పథకం అనేక కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని వివిధ డివిజన్లకు చెందిన 46 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.32 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేసినట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందేలా తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం మరింత చేరువయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పారదర్శకంగా అమలవుతోందని షబ్బీర్ అలీ అన్నారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పైరవీలు, అదనపు ఖర్చులకు తావు లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.నిజమైన అర్హులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్‌ఎఫ్ వంటి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని షబ్బీర్ అలీ కోరారు.ఈ కార్యక్రమంలో ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, జావిద్ అక్రమ్, కరీం, రత్నాకర్, ఫహీం, అరుణ్ ఖాన్, హాఫిజ్ లైక్ ఖాన్, అహ్మద్, నయీమ్ షహరాన్, పాపా ఖాన్, జాఫర్ హుస్సేన్, వహీద్, ముజాహిద్ ఖాన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.