Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 7:07 pm Posted by : ramakrishna

ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్రం స్పందించాలి

 

. . . పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్రం స్పందించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్‌యూ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలో శనివారం ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో నీట్, సీబీఎస్‌ఈతో పాటు ఇతర పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకోవడంపై నిరసనగా సోనమ్ వాంగ్‌చుక్ గత 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. సోనమ్ వాంగ్‌ చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని పీడీఎస్‌యూ తీవ్రంగా ఖండిస్తోందని వారు అన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నమ్మకమైన, పారదర్శకమైన, సురక్షితమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్, జిల్లా నాయకుడు మనోజ్, నగర నాయకులు శ్రీకర్, గౌరవ్, ప్రసాద్, వేణు, రాజేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

 

The Centre must respond to the question paper leaks.