. . . నీట్ పేపర్ లీకేజీపై టీజేఎస్ నిరసన
. . . టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, బతుకమ్మ :
నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఘటనపై తెలంగాణ జన సమితి (టీజేఎస్) శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని టీజేఎస్ డిమాండ్ చేసింది. లోయర్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద టీజేఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో నీట్ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కోదండరాం డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేసి, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ఉద్యమానికి తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకు రేపు టీజేఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
