Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 5:39 pm Posted by : ramakrishna

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది

 

. . . సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంతరం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. బుధవారం నగరంలోని సిఐటియు ఆఫీసులో లేబర్ కోడ్స్, కార్మికుల పై దాని ప్రభావం అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రూపుమాపి నాలుగు లేబర్ కోడ్లుగా రూపొందించారని అన్నారు. ఈ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా మారాయని, కనీస వేతనాలు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేకుండా రూపొందించబడ్డాయని మండిపడ్డారు. అదే విధంగా కార్మికుల పని గంటలను పెంచుతూ కార్మికులను బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయని, కష్టపడి పని చేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారి జీవితాలకు భద్రత లేకుండా రూపొందించబడ్డాయన్నారు. ఈ రోజు దేశభక్తులమని చెప్పుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలోని ప్రజలను బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మరోవైపు కార్మికుల శ్రమతో పెట్టుబడుదారుల జేబులు నింపి దాని నే దేశభక్తి అని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి దేశద్రోహులను కార్మికుల ఐక్యమత్యంతో ఎదిరించి ఈ దేశం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి నాయకత్వం నిరంతరం జాతీయ సంపదను దోపిడీ చేస్తూ ఉన్నారని అలాగే చివరికి అయోధ్య రామ మందిరంను కూడా వదలకుండా రాముని కానుకలను సైతం దోచుకుంటున్నారని అన్నారు. మరోవైపు నిరంతరం భారత దేశ సంపదను, అడవులను బొగ్గు గనులను ఎల్ఐసి బ్యాంకులను లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రజా ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని తెలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జె శంకర్ గౌడ్, సిఐటియు ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, జంగం గంగాధర్, సహాయ కార నన్నేసాబ్, స్వర్ణ, సుకన్య భూపతి, నల్లాల నర్సయ్య, ఎల్లయ్య, సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శిల్ప లింగం, సరిత తదితరులు పాల్గొన్నారు.

 

The Central Government is adopting anti-labor policies.