- కనీస వేతనం రూ.26000 ఇవ్వాలి
- సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు
భీమ్ గల్, బతుకమ్మ : కార్మికులు పోరాడి సాధించుకొన్న నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించి కార్మికులను కడు బానిసలుగా మార్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె లో భాగంగా సీ ఐ టీ యు ఆధ్వర్యంలో భీమ్ గల్ పట్టణంలో ఆయా రంగాల కార్మికులు స్థానిక ఎండిఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి వెంట అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని, మీ సవేతనం రూ.26,000 ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీకి ముందు జరిగిన కార్మిక సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చే పనిలో భాగంగా కార్మిక చట్టాలను సవరించి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కుదించి నాలుగు కోడ్లుగా మార్చిందని,దీనివల్ల కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.చట్టాల్లో సవరణలు తేవటం, సంక్షేమ పథకాల అమలులో కోతలు విధించడం, పని గంటల పెంపును నిర్ణయించటం పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్య అని, దీని మూలంగా పెట్టుబడిదారులు మరింత ఆస్తులు సంపాదించుకోవటానికి అవకాశం కల్పించారని ఆయన ఘాటుగా విమర్శించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచుతూ 282 జిఓ ని తీసుకురావటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని ఇట్టే అర్థమౌతుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఐక్య పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నారన్నారు. నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను రూ.26 వేలకు పెంచాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని లేనియెడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శంషాద్దీన్ ఐయఫ్టీయు నాయకులు అల్తాఫ్,అంగన్వాడి యూనియన్ నాయకులు దేవ గంగు, జ్యోతి, యమునా, ప్రమీల, చంద్రకళ, భాగ్యలక్ష్మి మున్సిపల్ యూనియన్ నాయకులు, మహేందర్, పోషన్న , గంగవ్వ, బీడీ యూనియన్ నాయకులు అశోక్, లక్ష్మణ్, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.