- నిరుపయోగంగా కొత్త భవనం
- ఆకతాయిలకు అండగా మారిన వైనం
- పెండింగ్ వర్క్ పూర్తి చేయాలంటూ బీజేపీ నాయకుల డిమాండ్
కోటగిరి, బతుకమ్మ : గత పాలకుల వైఫల్యం.. అధికారుల నిర్లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు నేటికీ నిరుపయోగంగా మారి అధికారుల అలసత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా కోటగిరి మండల కేంద్రంలోని విద్యాశాఖ సముదాయంలో తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి సెంటర్ అటు పనులు పూర్తి కాకా ఇటు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆకతాయిలకు అడ్డగా మారింది. రాత్రి సమయాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాంట్రాక్టర్కు లెక్కలు తేలక పోవడంతో నూతన భవనానికి విద్యుత్ సరఫరా అందించలేదు. దీంతో రెండు సంవత్సరాలుగా నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రం నిరుపయోగంగానే మారింది. లెక్కలు తేల్చాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్ధం. కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రానికి ఆనుకొని ప్రైమరీ స్కూల్, బీసీ,ఎస్సీ హాస్టల్స్ ఉండడంతో అల్లరిముకల వికృతి చేష్టలతో విద్యార్థులు భయాందోళన గురవుతున్నారు. రాత్రి సమయాలలో విద్యా సముదాయం మొత్తం అంధకారంగా ఉండడం వల్ల ఆకతాయిలకు ఆసరాగా మారింది.

- పెండింగ్ వర్క్ వెంటనే పూర్తి చేయాలి :ఏముల నవీన్
మూడేళ్ల క్రితం తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించి నిరుపయోగంగా ఉన్నటువంటి అంగన్వాడి నూతన భవనంలో మిగిలిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో నిరుపయోగంగా మారిన పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ…. భవనం నిరుపయోగంగా మారడంతో ఆకతాయిలకు అడ్డగా మారి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం నిర్మించిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో కొత్త భవనం ఉత్తగానే మిగిలిందని ఆయన అన్నారు. వెంటనే అధికారులు స్పందించి మిగిలిన పనులను పూర్తి చేసి భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బజరంగ్,శ్యామ్,సాయిలు,డాన్ రాజు,సాయిలు,మామిడి సాయి,రోషన్ తదితరులు పాల్గొన్నారు.
