. . . 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు చేసింది శూన్యం
. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బీజేపీ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఏదైతే హామీ ఇస్తుందో, అది పక్కాగా అమలు చేస్తుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన 9, 10, 11 డివిజన్‌లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటైనా పూర్తిగా అమలు చేయని చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఇస్తామని చెప్పి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. అలాగే ₹2,000 పెన్షన్ దారులకు ₹4,000 పెన్షన్, ₹4,000 పెన్షన్ దారులకు ₹6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి చివరకు మొండి చేయి చూపారని విమర్శించారు. చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పారని, ఇచ్చారా? అని ప్రశ్నించారు. అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారని, ఇచ్చారా? అని ప్రజలను నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో కనీస విద్య అందించకపోవడమే కాకుండా, నాణ్యమైన భోజనం కూడా అందించలేని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కట్టిస్తామని గొప్పలు చెప్పడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు కావాల్సింది ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనమని, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఆ తరువాత చూసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఇక, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా బుధవారం ఓ సమావేశంలో తోపులా మాట్లాడారని, ఆయన పదేళ్ల పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. కనీసం నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కూడా అందించలేని మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలను మభ్యపెడుతున్నారని ఘాటుగా మండిపడ్డారు. ఆయన పదేళ్ల పరిపాలనలో అవినీతికి ప్రాధాన్యతనిస్తూ, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి, నాణ్యతలేని పనులు చేపట్టి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తన అనుచరులతో కలిసి పంచుకోలేదా? అని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీ 9వ డివిజన్ అభ్యర్థి ఇల్లందుల మమత, ప్రభాకర్, 10వ డివిజన్ అభ్యర్థి పుట్ట వీరేందర్, 11వ డివిజన్ అభ్యర్థి గట్ల సుజాత, గంగాధర్, మండల అధ్యక్షులు నాగరాజు, డివిజన్ నాయకులు, కిరణ్, సుందర్ రాథోడ్,సాయినాథ్ పవర్, మారుతీ, శివాజీ, వెంకటేష్, చంద్రకాంత్, డివిజన్ నాయకులు, పవర్ కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
