- సిమ్ కార్డుల కంటే సులువుగా బెట్టింగ్ ఐడీలు
- సూత్రదారులు.. పాత్రదారులు.. అంతా పాత నేరస్తులే
- చోద్యం చూస్తున్న పోలీస్ యంత్రాంగం
- ఆకుల కొండూరులో ఐదు లక్షల పోగొట్టుకొని ఆకాష్ ఆత్మహత్య
- జిల్లాలో మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ పై చర్చ
నిజామాబాద్ క్రై0, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ జడలు విప్పింది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిందో లేదో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాగానే బెట్టింగ్ కూడా విస్తృంకలంగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ భూతానికి పెట్రోల్ బంక్ లో పనిచేసే యువకుడు బలి అయ్యాడు. చేసేది చిన్నా చితక జీతం. ఆన్లైన్లో జరిగే బెట్టింగ్ కోసం రూ.5,00,000 పోగొట్టుకోవడంతో మనస్థాపo చెందిన నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ లపై ప్రభుత్వం నిషేధం విధించింది. బెట్టింగ్ యాప్ లపై ప్రచారం చేసిన సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసి కోర్టుకు లాగింది రాష్ట్ర ప్రభుత్వం. అంతటితో వదలకుండా ఆన్లైన్ బెట్టింగ్ పై సిట్ ఏర్పాటు చేసింది. బెట్టింగ్ ల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారి వివరాలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కార్యాలయాలకు అన్ని రకాల బెట్టింగ్ ల పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ఆన్లైన్ బెట్టింగ్ పై పోలీస్ శాఖ దృష్టి సారించిన సమయంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.
నిజమాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ జడలు విప్పింది. మొదటి నుంచి పేకాట, మట్కాకు జిల్లా కీలకంగా ఉంది. మట్కా, పేకాటలను పోలీసు యంత్రాంగం ఉక్కు పాదంతో అణిచివేసి నిషేధ జాబితాలో వుంచగా గేమింగ్ యాక్ట్లతో బెంబేలెత్తిస్తోంది. అయితే ఇదివరకే మట్కా, పేకాటలు ఆన్లైన్లో కొనసాగుతుండగా క్రికెట్ బెట్టింగ్ కూడా ఆన్లైన్కు విస్తరించింది. గతంలో బెట్టింగుకు బొకేలు ఆఫ్ లైన్ లో లావాదేవీలు జరిపేవారు. ప్రస్తుతం అంతా ఐడీ ల ద్వారా ఈ దందా విస్తరించింది. స్మార్ట్ ఫోన్ యూపీఏ చెల్లింపులు ఉంటే చాలు ఆన్లైన్లో బెట్టింగులు కాయవచ్చు. పక్కవారికి తెలియకుండానే ఐడీలు తీసుకొని బెట్టింగ్ ఆడుతూ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. అసలు సూత్రధారులు మధ్యవర్తులు ఎవరు అనేది తెలియకుండానే ఈ దందా కొనసాగుతోంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్లైన్ బెట్టింగ్ కు కొందరు సూత్రదారులుగా చెబుతున్నారు. ముజాహిద్ నగర్ కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి గతంలో బెట్టింగ్ నిర్వహించి కోట్లకు పడగలెత్తాడు. ప్రస్తుతం ఇతరులకు ఐడీలు కేటాయించి దందాలు నిర్వహించడం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం బోధన్ రోడ్ లో స్నూకర్ పాయింట్ వద్ద హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ ముఠా ప్రస్తుతం జోరుగా బెట్టింగ్ను కొనసాగిస్తుంది. స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రధాన సూత్రధారులపై హత్యాయత్నం కేసు నమోదైన దళారులు ప్రవేశించి కేసును నీరుగార్చడం విశేషం. నగరంలోని ఎల్లమ్మ, గుట్ట హైమద్పుర కాలనీకి చెందిన యువకులు కీలక సూత్రధారులుగా చెప్పాలి. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా రేడియో స్టేషన్ ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు ఇప్పటికీ రోజువారీగా ఐడీలని ఇస్తూ బెట్టింగ్ను కొనసాగించడం గమనార్హం. నగరంలోని గాజులపేటకు చెందిన శివ అనే యువకుడు ఇప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ నడుపుతున్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్, డిచ్పల్లి, నందిపేట్, బాల్కొండ ప్రాంతాలలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది. ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి మొదలుకొని కూలి పనులు చేసుకునే వారు కూడా డబ్బులు అధికంగా వస్తాయని ఆశతో వేల రూపాయలు బెట్టింగ్లో పెట్టుకొని సర్వం కోల్పోతున్నారు.