Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 3:51 pm Posted by : ramakrishna

బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ లు మంజూరు చేయాలి

రుద్రూర్, బతుకమ్మ  : బీడీ పరిశ్రమలో ప్రస్తుతం బీడీలు చేసేటటువంటి కార్మికులకు పెన్షన్లు రాకుండా పాలకుల ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి.యు.సి.ఐ) జిల్లా ఉపాధ్యక్షులు బి.మల్లేష్ అన్నారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో బి. మల్లేష్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాల మూలంగానే బీడీ కార్మికులందరికీ రాజీనామాలు చేసిన తర్వాత కార్మికుల పీఎఫ్ నిధి నుండి ఇచ్చేటటువంటి పెన్షన్ అందరికీ రావడం లేదని, అట్లా రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానమే కారణమని తీవ్రంగా దుయ్యబట్టారు. కావున గతంలో 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే పెన్షన్ వచ్చేదని, ప్రస్తుతం 10 సంవత్సరాల పని దినాలు ఉండాలని నిబంధనలను కేంద్రం విధించిందని, మరోవైపు బీడీ కార్మికులకు ప్రతి దినము పనులు లేకుండా బీడీల పైన ఆంక్షలు విధించిదని ఇలా అయితే కార్మికులకు 10 సంవత్సరాల పని దినాలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కావున బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.యు. సి. ఐ నాయకులు జి.చంద్రమోహన్, బీడీ వర్కర్స్ యూనియన్ రుద్రూర్ మండల నాయకులు ఎం. లత, టి. శోభ,ఎస్. లలిత, సిహెచ్ సావిత్రి, కార్మికులు పాల్గొన్నారు.