- మహిళలను ఆరెస్టు చేసి.. విటులను తప్పించారా..?
- మాజీ ఉప సర్పంచ్ ప్రముఖులు అని తప్పించారా?
- వ్యక్తిగత పూచికత్తు పేరిట ఎలా వదులుతారు
- 18 గంటల హైడ్రామాలో అసలు ఎమి జరిగింది
- గోదావరి పరివాహక ప్రాంతం పోలీస్ స్టేషన్ పోలీస్ ల తీరుపై సర్వత్ర చర్చ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలోని మండలంలోని ఒక పోలీస్ స్టేషన్ పోలీసు అధికారుల తీరు పై పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది. పోలీసులు తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గత వారం వ్యభిచార కేంద్రంపై దాడి నిర్వహించారు. దాడిలో 8 మంది మహిళలు ( మహరాష్ట్ర వాసులు), మండలానికి చెందిన ఇద్దరు నిర్వాహకులను పట్టుకున్నారు. కాని విటులు మాత్రం దొరికినట్లు కేసులో చూపలేదు. అంతే గాకుండా వ్యభిచార కేంద్రం ఇంటి యజామానిపై కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఈ అంశం కొత్త చర్చకు దారి తీసింది…..
వ్యభిచార కేంద్రం పై పోలీసుల దాడి సర్వ సాధారణం. దాడిలో మహిళలు ( లేదా యువతులు)తో పాటు నిర్వాహకులు, విటులు పట్టు బడటం సాధారణంగా జరుగుతుంది. పోనీ అలా కాదు కూడదు అంటే వ్యభిచార రొంపిలోకి (హ్యూమన్ ట్రాఫికింగ్ ) దించిన వారిపై కేసుల నమోదు జరగుతుంది. మైనర్ ల చేత చెడ్డపనులు చేయించిన పోక్సో కేసులు నమోదు చేస్తారు. కాని గోదావరి నది పరివాహక ప్రాంతం పొలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులు కేసు నమోదు పై విమర్శలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నిర్మల్ జిల్లా బాసర మండంలోని ఒక గ్రామ ఉప సర్పంచ్ తో పాటు మరో ఇద్దరు పట్టుబడ్డట్టు విశ్వసనీయ సమాచారం. కాని వారిని వదిలీ కేవలం ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తుంది.
పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడి చెసిన తరువాత 18 గంటల పాటు హైడ్రామా నడిచిందని అంత కోడై కూస్తున్నారు. బాసర మండలంలోని ఒక గ్రామ ఉపసర్పంచ్ తో పాటు మరో ఇద్దరు పట్టుబడగా వారు ప్రార్థన మందిర ప్రారంభానికి సంబంధించిన ఆహ్వాన లేఖలు పంచడానికి రాగా వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని విచారించిన తరువాత వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. కాని వారిని విడిచి పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున పైరవీకారులు వచ్చారని తెలిసింది. ముగ్గురు విటులను తహసీల్ధార్ ముందు బైండోవర్ కు ప్రయత్నించిన అంగీకరించలేదని సమాచారం. ఈ కేసు నుంచి విటులను తప్పించేందుకు పెద్ద ఎత్తున అమ్యామ్యాలు చేతులు మారడంతో వ్యభిచార కేంద్రంపై దాడి కేసులో కేవలం నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, దొరికిన మహిళలను స్వధార్ హోంకు తరలించారు. ఈ విషయంపై ‘బతుకమ్మ’ రూరల్ సిఐ ని వివరణ కోరగా వ్యభిచార కేంద్రంపై దాడి వాస్తవమేనని, కాని ముగ్గురు పురుషులను అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని విచారణ అనంతరం వ్యక్తిగత పుచికత్తుపై పంపించింది వాస్తవమేనని అంగీకరించారు.