Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:08 pm Posted by : ramakrishna

ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమే

 

. . . మైలారం బాలు మాదిగ

 

నందిపేట, బతుకమ్మ :

 

రాష్ట్రంలోని అన్ని కులాలకు చెందిన పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందుబాటులోకి రావడం ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట ఫలితమేనని ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మైలారం బాలు మాదిగ పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని తుషాల్ గార్డెన్‌లో శుక్రవారం ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ నందిపేట మండల ఇన్‌చార్జి పైడకుల ప్రశాంత్ మాదిగ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆరోగ్య సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఒక భరోసాగా నిలిచిందని, ఆ భద్రత వెనుక ఎంఆర్పీఎస్ చేసిన దీర్ఘకాల పోరాటం ఉందని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనసభలో ఎంఆర్పీఎస్ ఉద్యమం కారణంగానే ఈ పథకం అమలులోకి వచ్చిందని ప్రస్తావించారని గుర్తు చేశారు. సమాజంలో మహనీయుల ఆలోచనలే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మార్గదర్శకమని, కుల, మత వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం మాదిగ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల హక్కుల సాధనే ఎంఆర్పీఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న దండోరా ఉద్యమం సమాజ హితం కోసమే సాగుతోందని చెప్పారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో నందిపేట మండలంలోని గ్రామ కమిటీల పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ, మండల స్థాయి కమిటీల్లో మాదిగ యువత చురుకుగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

 

The Arogyasri scheme is the result of the MRPS struggle.