నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్య రంగ సమస్యలపై నిరంతర పోరాటమే పీడీఎస్ యూ లక్ష్యమని విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ అన్నారు. పీడీఎస్ యూ 50 ఏళ్ల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు శుక్రవారం విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. తమ ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డి స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నామని, పెండింగ్ స్కాలర్ షిప్ లు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగిస్తున్నామన్నారు. స్వర్ణోత్సవం సందర్భంగా ఈనెల 30న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు పీడీఎస్ యూ నాయకులు, పూర్వ విద్యార్థులు, మేధావులు తరలిరావాలని ఆయన కోరారు. ర్యాలీలో జిల్లా కార్యదర్శి కర్క గణేశ్, ఉపాధ్యక్షుడు అనిల్, నాయకురాలు మమత తదితరులు పాల్గొన్నారు.
