Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 5:41 pm Posted by : ramakrishna

నగరాన్ని ఒక ‘మోడల్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం

. . . ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ వెల్లడి

 

. . . నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 

 

. . . ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కలెక్టర్ తో భేటీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ

 

నగరాన్ని ఒక ‘మోడల్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. సీం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్ధం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని, నగరంలోని వివిధ డివిజన్లలో మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లను కలెక్టర్ ఇలా త్రిపాఠి కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. నూతనంగా జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కు వారు అభినందనలు తెలియజేసి, జిల్లా ప్రగతిపై కొద్దిసేపు చర్చించారు. నగరంలోని ఆయా డివిజన్లలో రూ. 60 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపడుతున్న అంతర్గత రోడ్లు, సీసీ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు వినాయకనగర్ వద్ద శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సుమారు రూ. 6 కోట్లను వెచ్చిస్తూ అధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా విస్తరణ వంటి అభివృద్ధి పనులను చేయిస్తున్నామని అన్నారు. జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలిసికట్టుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. నగర అభివృద్ధి కోసం మంజూరైన నిధులే ఇందుకు నిదర్శనం అని అన్నారు. గతంలో నిధుల కేటాయింపులో వివక్ష ఉండేదని, కానీ ఇప్పుడు పార్టీలకతీతంగా 60 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు కోటి రూపాయలు చొప్పున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్వల్ప కాలంలోనే నగర ప్రగతి కోసం రూ. 500 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు చేశామని అన్నారు. ఇకముందు కూడా మరిన్ని నిధులు తెచ్చి నగర సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషిని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

The aim is to make the city a 'model city'
The aim is to make the city a ‘model city’