- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి విమజ్జనం వరకు నిర్వాహణకు సహకరించిన ప్రతీఒక్కరికి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కృతజ్ఞతలు తెలిపారు. కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకున్నారన్నారు. కమిషనరేటు పరిధిలో దాదాపు 6000 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించారని తెలిపారు. ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9, 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేశారని అన్నారు. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేశారని తెలిపారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బాసర , ఉమ్మెడ ఇవి కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన, నిమజ్జనం వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి , విగ్రహ గణేష్ కమిటీలు , మజీద్ కమిటీలు, అన్నిమతాల ప్రజలు, ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించారని తెలిపారు. అదే విధంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతి మున్సిపాలటి , అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించారన్నారు.
