Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 4:44 pm Posted by : ramakrishna

భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితులు

 

. . . హైడోస్ ఇంజెక్షన్ వివాదం

 

. . . సర్పంచ్ మృతి అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిపై దాడి, అగ్నిప్రమాదం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భద్రాచలంలో శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దంతెలబోరు గ్రామ సర్పంచ్ సోడె వెంకటరమణ మృతి నేపథ్యంలో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై దాడి చేసి నిప్పంటించారు. ఘటనతో ఆసుపత్రిలో ఆస్తినష్టం సంభవించగా, ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వెంకటరమణ మృతి చెందారని, హై-పవర్ డోస్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆసుపత్రిపై దాడికి పాల్పడి, అనంతరం అగ్నికి ఆహుతి చేశారని సమాచారం. సమాచారం అందుకు న్న పోలీసులు భారీగా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆసుపత్రి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు బాధ్యులైన వైద్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సర్పంచ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆసుపత్రి ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం లేదా వైద్యుల స్పందన ఇంకా వెలువడలేదు. అలాగే వైద్య నిర్లక్ష్యంపై అధికారికంగా నిర్ధారణ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.