Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2024, 11:55 am Posted by : ramakrishna

గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత

. పోలీసులు లాఠీచార్జి చేశారని యువజన సంఘాల నాయకుల ఆగ్రహం

. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నిరసన

. చర్చల అనంతరం సద్దుమణిగిన వివాదం

. కామారెడ్డిలో ఘటన

కామారెడ్డి, బతుకమ్మ: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుండగా జిల్లా కేంద్రంలోని పాంచ్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనం ఆలస్యమవుతోందని పోలీసులు బ్యాండ్ వారిని పక్కకు తప్పించి విగ్రహాలను ముందుకు వెళ్లాలని సూచించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు యువజన సంఘాల నాయకులను చెదరగొట్టారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి తమపై లాఠీచార్జి చేశారంటూ యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. లాఠీలతో కొట్టడంతో గాయాలయ్యాయని యువకులు తెలిపారు. తాము చెదరగొట్టే ప్రయత్నంలో సంఘాల నాయకులు పరుగులు తీస్తూ కింద పడడంతో గాయాలపాలైనట్లు పోలీస్ అధికారులు అంటున్నారు. భారీ విగ్రహాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని చెప్పారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. నిరసన అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగింది. డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం యువజన సంఘాల నాయకులు, హిందూ సంఘాల నాయకులతో పలుమార్లు చర్చలు జరిపారు. చివరకు రాజీ కుదిరి ఆందోళన విరమించారు.