- రికార్డుల్లో లేకున్నా భూమి కబ్జాలో ఉన్నట్లు రికార్డులు
- సిర్పూర్ భూముల్లో కొత్త కోణం
- కబ్జాలో ఉన్నట్టు మ్యాప్ ల తయారి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో అర్హులైన వారు తమకు భూమిపై హక్కులు ఉన్నాయని, పత్రాలు ఉన్నాయని రెవెన్యూ, సర్వే కార్యాలయాల చుట్టు చెప్పులరిగేలా తిరుగుతున్నా వారికి నిబంధనలు సాకుగా చూపి చుక్కలు చూపుతున్నారు. మొన్నటి వరకు ఉన్న ధరణి పోర్టల్ ను ఆధారం చేసుకుని ఇప్పటికి చాలా మంది తమ యజమాన్యాల హక్కుల కోసం కార్యాలయాల చుట్టు చక్కర్లు కొడుతున్నారు.కానీ రెవెన్యూ అధికారులు, ల్యాండ్ సర్వే అధికారులు కలిసుంటే మాత్రం భూమి లేకపోయినా, కబ్జాలు ఉండకపోయినా ప్రభుత్వ భూమి అయినా, ప్రైవేట్ భూమి అయినా దానికి యజమానులు రాత్రికి రాత్రే పుట్టుకొస్తారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో 602 సర్వే నంబర్ లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గత దశాబ్ధ కాలం క్రితం ముందు వరకు అక్కడ ప్రభుత్వం భూముల కేటాయింపు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకైనా, ప్రభుత్వం నుంచి ఎవరికి అసైన్డ్ భూమి కేటాయించలేదు. కానీ అక్కడ కబ్జా భూములకు ల్యాండ్ సర్వే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఏకంగా కబ్జాలో ఉన్నట్లు మ్యాప్ లు, రికార్డులను తయారు చేసి అప్పగించే దందా కొనసాగుతుంది.
మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో 602/112లో కల్వరాల చంద్రకళ, 602/113లో సద్మల సాయన్న, 602/114లో శివాల బాలక్రిష్ట, 602/115లో లక్కసాయన్న అనే వ్యక్తులకు గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది. సంబంధిత అడంగల్ పహానీలో, 22ఏ రిజిష్టర్ లో సబ్ డివిజన్ లలోనూ (ధరణి పోర్టల్)లోనూ వారి పేర్లు పక్కాగా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో సర్వే ల్యాండ్ రికార్డు అధికారులు మాత్రం అవే సర్వే నంబర్ లలో సామ సాయన్న, సద్మల సాయన్న, సద్మల పోశెట్టి, కడదూరి వెంకయ్య అనే వ్యక్తల పేర్ల మీద భూములున్నట్లు మ్యాప్ గీసి అప్పగించారు. వారి పేర్లపై రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో ఎలాంటి రికార్డులు లేవు. కేవలం ల్యాండ్ సర్వే డిస్ట్రిక్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన కబ్జా మ్యాప్ ను ప్రామాణికంగా చేసుకుని అక్కడ సంబంధిత వ్యక్తులు భూములను చెరబట్టారు.
స్థానికంగా సంబంధిత సర్వే నంబర్ లోనూ 602/110, 602/111లలో 1984లో అవదూత నిర్మలానంద స్వామి అనే స్వామి వారికి అప్పటి ప్రభుత్వం ఐదు ఎకరాలు కేటాయించింది. అందులో వ్యవసాయం కూడా నిర్వహిస్తుండగా స్థానిక సిర్పూర్ కు చెందిన వారే కబ్జాకు దిగారు. అంతకుముందు నర్సింగ్ పల్లికి చెందిన వారు దానిని కౌలుకు చేస్తుండగా వారిని కాదని భూమిని చెరబట్టారు. కేవలం డిస్ట్రిక్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన మ్యాప్ ను ప్రామాణికంగా చేసుకుని సంబంధిత భూమిలో పాగా వేయాలని చూస్తున్నారు. గతంలో ఇచ్చిన డిఐ రిపోర్టును ప్రామాణికంగా చెబుతూ ప్రస్తుత సర్వేయర్ కూడా రికార్డులలో లేని వ్యక్తులు కబ్జాలో ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నించడం విశేషం. ఈ వ్యవహరంలో కాసులు చేతులు మారినా ఇప్పటికి మాత్రం ఎలాంటి రికార్డులు లేవు. సంబంధిత విషయం అధికారులకు తెలిసినా రికార్డులు లేవని గుర్తించినా చట్టరీత్యా చర్యలకు వెనుకడుగు వేయడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికి సంబంధిత భూమి సర్వే విషయంలో వివాదం జరుగుతుండగా సంబంధిత రెవెన్యూ అధికారులు రికార్డులన్నీ పట్టాదారులేవనని చెబుతుంటే ల్యాండ్ సర్వే అధికారులు మాత్రం కబ్జాదారుల వైపు మొగ్గు చూపడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ మొదలయింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో ల్యాండ్ సర్వే అధికారులు, జిల్లా యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారు.
