Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 8:06 pm Posted by : ramakrishna

శివనామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయాలు

 

. . . విద్యుత్ దీపాలతో కనువిందు చేస్తున్న దేవాలయాలు

 

. . . భక్తి శ్రద్ధలతో రెండు రోజుల మహా శివరాత్రి వేడుకలు

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. పండగకు వారం రోజుల ముందుగానే ఇళ్లను శుభ్రపరిచి, పూజా సామగ్రిని సిద్ధం చేసుకుని భక్తులు ఉత్సాహంగా వేడుకలను ఆరంభించారు. పట్టణంలోని ఏక చక్రేశ్వర స్వామి దేవాలయంతో పాటు పరిసర గ్రామాల శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఆలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాలు హర హర మహాదేవ”, “శంభో శంకరనినాదాలతో మార్మోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా దేవాలయాలను విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. రంగురంగుల లైటింగ్‌తో ఆలయాలు కళకళలాడుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భజనలు, కీర్తనలు, జానపద గేయాలు, ఆటపాటలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. భక్తులు మొదటి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తూ శివనామ స్మరణలో మునిగిపోయారు. రెండో రోజు ఉదయం శివయ్యకు నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించి ఉపవాసాన్ని విరమించుకుంటున్నారు. కోరిన కోరికలను తీర్చే బోలో శంకరుడిగా శివయ్యను భక్తులు విశ్వసిస్తున్నారు. పురాణాలలో కూడా శివుడిని భక్తులకు వరాలు ప్రసాదించే దేవుడిగా పేర్కొన్నట్లు వారు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఏక చక్రేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరగా, పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. మొత్తం మీద బోధన్ పట్టణం భక్తి వాతావరణంలో మునిగిపోయింది.

 

Temples that are transformed by the remembrance of Shiva's name