Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 4:53 pm Posted by : ramakrishna

‘శ్రీమద్రామాయణం’కు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రముఖ కవి, తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ, సీనియర్ గ్రూప్‌-1 అధికారి శశికిరణ్ కొమాండూర్ రచించిన పద్య మహాకావ్యం ‘శ్రీమద్రామాయణం’ ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైంది. 2024 సంవత్సరానికి గాను ఈ పురస్కారం ఆయన రచనకు దక్కింది. పరిపాలనా బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత రెండు దశాబ్దాలుగా శశికిరణ్ కొమాండూర్ సాహిత్య సాధన కొనసాగిస్తున్నారు. సామాన్య పాఠకుడికి సైతం సులభంగా అర్థమయ్యే వాడుకభాషలో, ఛందోబద్ధంగా ‘శ్రీమద్రామాయణం’ను ఆయన రచించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో ఈ మహాకావ్యాన్ని ప్రచురించింది. సాహితీవేత్తగా గుర్తింపు పొందిన శశికిరణ్ కొమాండూర్ వ్యక్తిగత జీవితంలోనూ నైతిక విలువలు, నిజాయితీకి ప్రాధాన్యం ఇచ్చే అధికారిగా పేరొందారు. గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఆయన రచన పరిశీలనకు వచ్చినప్పటికీ, అప్పట్లో తాను సంబంధిత కేంద్ర మంత్రివద్ద విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నైతిక కారణాలతో ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. పదవిలో ఉన్న సమయంలో తన శాఖకు సంబంధించిన అవార్డును స్వీకరించడం వల్ల విమర్శలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న శశికిరణ్ కొమాండూర్‌కు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం లభించడం పట్ల కవులు, రచయితలు, ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

. . . లోక్‌భవన్‌లో ఘన సత్కారం

తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైన శశికిరణ్ కొమాండూర్‌ను లోక్‌భవన్‌లో గ్రూప్‌-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, గవర్నర్ ఉప కార్యదర్శి జి. పల్లవి, ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం, సమన్వయ అధికారి మురళీచార్యులు, అకౌంట్ ఆఫీసర్ శైలజ, అసిస్టెంట్ కంప్ట్రోలర్ జెడ్. హెరాల్డ్ డేవిడ్, ఉద్యానవన అధికారిణి మాలిని, డీఈఈ శ్రీధర్, సెక్షన్ ఆఫీసర్ ఎస్. రామచంద్రం, సాంఖ్యక అధికారి శ్రీకాంత్, ఏఈఈలు హర్షవర్ధన్, త్రిష తదితరులు ఘనంగా సత్కరించా రు. ఈ సందర్భంగా లోక్‌భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శశికిరణ్ కొమాండూర్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆయన సాహిత్య సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

 

Telugu University Literary Award for ‘Srimad Ramayanam’