నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం “తెలుగు సాహిత్యం- ప్రదర్శన కళలు” అంశంపై బుధవారం కార్యశాలను నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రంగరత్నం సభాధ్యక్షత వహించి మాట్లాడారు. విద్యార్థి మానసిక వికాసానికి కళలు ఎంతో సహకరిస్తాయని తెలుగు అధ్యాపకులందరికీ అభినందనలు తెలిపారు. ఇందూరులో ఎంతోమంది వ్యాఖ్యాతలు, కవులు, కళాకారులు ఉన్నారని, వారి సహకారంతో కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అవగాహనను కల్పించి, వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యశాలను ఏర్పాటు చేశామని కార్యశాల సమన్వయకర్త డా . ఏం. రామస్వామి అన్నారు. ఉపన్యాస కళ అనే అంశంపై ప్రముఖ వ్యాఖ్యాత వీపీ చందన్ రావు హాజరై వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ కవులు, రచయితల ఉపన్యాసాలను ఉదాహరించారు. ఈ సందర్భంగా చందన్ రావ్ విసిరిన ఛలోక్తులు అందరిని నవ్వించాయి. రెండవ సమావేశంలో రంగస్థల ప్రదర్శన కళలు అంశంపై ప్రముఖ రంగ స్థల నటుడు, దర్శకుడు చామకూర శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రంగస్థలం, అభినయాల వైరుద్యాలను వివరించారు. గాంధీ జయంతి నాటకంలోని ఓ సన్నివేశాన్ని నటించి అందరిని ఆకట్టుకున్నారు. విద్యార్థులకు నటన గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హాజరైన వక్తలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ గంగాధర్ ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ పిఆర్ఓ డాక్టర్ దండు స్వామి కార్యశాల సమన్వయకర్త డాక్టర్ ఎం. రామస్వామి, రమేష్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి కే గంగాధర్ అధ్యాపకులు రాజేశ్వర్, రాధిక, అర్చన, సవిత, పద్మారావు, రాహుల్, సుభాషిణి దేవి, అనసూయ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
