నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవంను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రామ్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి, మనందరం తెలుగు భాషను కాపాడుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. రంగరత్నం మాట్లాడుతూ… మాతృభాషను కాపాడుకోవడం అంటే మన చరిత్రను, సంస్కృతిని, అస్థిత్వాన్ని కాపాడుకోవడం అని అన్నారు. ఐ.క్యూ.ఏ. సి.కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ అన్ని భాషలు ముఖ్యమే అయినప్పటికీ మాతృభాషను కాపాడుకోవాలని, గిడుగు వారు సవరభాషకు విశేషమైన కృషి చేశారన్నారు. తెలుగు విభాగం అధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ.. పరిమిత ప్రయోజనాలు ఉన్న గ్రాంథిక భాష నుండి అపరిమితమైన ప్రయోజనాల కోసం వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు వారి కృషి ఫలితంగానే నేడు ప్రచార సాధనాలలో, సినిమాలలో, పత్రికలలో, పాఠ్యాంశాలలో, పరిశోధనలలో, సాహిత్య రచనలలో వ్యవహారిక భాష విరి విగా వాడబడుతుందని అన్నారు. శాసనాలను పరిశీలించి, ప్రాచీన గ్రంథాలను శోదించి, వ్యవహారిక భాష వాడుక పూర్వం నుండే ఉందని నిరూపించి, గ్రాంథికవాదుల మీద గిడుగు విజయం సాధించాడని, భాషా ఉద్యమం కోసం “తెలుగు” అనే పత్రికను నడిపాడని అన్నారు. తెలుగు భాష పైన అద్భుత మైన ప్రసంగాలు చేసిన విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.వో. డాక్టర్ దండు స్వామి, అదనపు అకాడమిక్ కోఆర్డినేటర్ రాహుల్, కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ శమంత, తెలుగు అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్, కె. గంగాధర్, ఆర్. రాజేశ్వర్, రాధిక,అర్చన, రాజశేఖర్, ప్రతిభ, సుభాషిని దేవి, లావణ్య, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.