హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురువులకే చక్కులు చూపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని, పీకేయడానికి ఆయన మొక్క కాదు వేగుచుక్క అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్య మంత్రి రేవంత్ తోపాటు మంత్రులు తిట్ల పరిపాలన చేస్తున్నారని, రాష్ర్టంలో ఒకప్పుడు నిధులు వదలాపారితే ఇప్పుడు తిట్లు పారుతున్నాయని ఎద్దేవా చేశారు. సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీని కలిసిన పద్మశాలీ నాయకులు
కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పద్మశాలీ సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బ్రిటీష్ పాలనలో కూడా చేనేతపై పన్ను లేదని ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఇఫ్పుడు ఆ హామీని విస్మరించడం శోచనీయమని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు.