కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర 3వ కార్యవర్గ సమావేశం కామారెడ్డిలోని కర్షక్ బీఈడీ కళాశాలలో రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అధ్యక్షతన, తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు సమన్వయంలో మంగళవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరవే కృషిని ప్రశంసిస్తూనే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెరవే చేస్తున్న సేవను అవలోకనం చేసుకున్నారు. తెలంగాణ భాష, సాహిత్యం, సాంస్కృతి, చరిత్రల పునర్నిర్మాణం కోసం తెరవే నిరంతరం పాటుపడుతూనే ఉన్నదని వక్తలు అన్నారు. సమకాలీనమైన సమస్యల సాధన కోసం తెలంగాణ రచయితలు సంఘటితంగా కలం కదుపుతూ, భావసారుప్యం కలిగిన సంస్థలతో కలిసి నడుస్తున్నదని తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక 2001లో ఆవిర్భవించి నేటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ మాసంలో రజతోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల తెలంగాణ రచయితల వేదిక చరిత్రను అచ్చురూపంలోకి తీసుకురావాలని, ప్రత్యేక కవితా సంకలనాన్ని వెలువరించుకోవాలని తీర్మానం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెరవే రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఉదారి నారాయణ, నగునూరి శేఖర్, సూరారం శంకర్, కూకట్ల తిరుపతి, ఆడెపు లక్ష్మణ్, రాష్ట్ర కోశాధికారి పెంచాల రంగన్న, రాష్ట్ర కార్యదర్శులు గఫూర్ శిక్షక్, తప్పెట ఓదయ్య, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ వెంగలి నాగరాజు, చౌడబోయిన తిరుపతి, నారాయణ గౌడ్, వెంకట్, మహమ్మద్ పాష, దర్పల్లి సాయికుమార్, విజయశ్రీ తదితర జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్షక బీడీ కళాశాల ప్రిన్సిపల్ రషీద్ ఆతిథ్యం ఇచ్చారు.