Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2025, 6:32 pm Posted by : ramakrishna

సాగునీటి ప్రాజెక్టులపై 31న తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

  • పాల్గొననున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • హాజరుకానున్న మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు

 

హైదరాబాద్, బతుకమ్మ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేయడానికి ఈనెల 31న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.  మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్ గారు నిర్మించిన కీలక ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నదని, కాబట్టి ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అభిప్రాయపడింది.  కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తిప్పికొడతామని స్పష్టం చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ అన్ని అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, ఆ మేరకు తీర్మానాలను ఆమోదిస్తామని తెలియజేసింది. కేసీఆర్ ప్రారంభించారనే అక్కసుతో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిలిపివేసింది. సీతారామ ఎత్తిపోతలను ప్రచార ఆర్భాటం కోసం అధికారికంగా ప్రారంభించి ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల టెండర్ల విషయంలోనూ ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని పెండింగ్‌ పనులను చేపట్టడం లేదు. ఓవరాల్‌ గా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సమర్థ వినియోగం మీదనే స్పష్టత లేదు.. కృష్ణా. గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులతో పాటు కృష్ణాలో న్యాయమైన నీటి వాటాల సాధన కోసం కొత్త ట్రిబ్యునల్‌ సాధించిన ఘనత కూడా కేసీఆర్‌ ప్రభుత్వానిదే.. దానిపై కాంగ్రెస్‌ పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తోంది.. ఈ అన్ని అంశాలను ప్రజలకు తేటతెల్లం చేసేలా రౌండ్‌ టేబులఖ సమావేశంలో సమగ్రంగా చర్చించాలని నిర్ణయించింది.