నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి తెలంగాణ పోరాట యోధురాలు జె. ఈశ్వరీ బాయి పేరు పెట్టి “ఈశ్వరీ బాయి తెలంగాణ విశ్వవిద్యాలయం” గా మార్చాలని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారను. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఉద్యోగ సంఘాల నాయకులు, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఫూలే-అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు పాల్గొని ప్రసంగించారు. సభాద్యక్షులు,వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ “తెలంగాణ తొలిదశ ఉద్యమకారురాలు జె.ఈశ్వరీ బాయి గొప్పతనాన్ని గుర్తించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఈశ్వరీ బాయి పేరు పెట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆమె తెలంగాణ తొలి దశ ఉద్యమంలో చెన్నారెడ్డి తర్వాత రెండో స్థానంలో ఉన్న నాయకురాలని తెలిపారు. తెలంగాణ కోసం జైలు పాలైన మొట్టమొదటి మహిళ నాయకురాలు ఈశ్వరీ బాయి అని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం పదవులు ఆశజూపినా ఆమె పదవుల కోసం ఆశపడలేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసిన నిజాయితీ, నిబద్దత కలిగిన నిఖార్సైన ఉద్యమకారిణి ఈశ్వరీ బాయి పేరు పెట్టడం వల్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ కూడా పెరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి ఈశ్వరి బాయి పేరును తెలంగాణ యూనివర్సిటీ కి పెట్టేటట్టు రాష్ట్ర ప్రభుత్వ,గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అలుక కిషన్, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు గంట సదానందం,సీనియర్ దళిత నాయకులు సిద్ది రాములు,మాదిగ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్రఅధ్యక్షులు కొక్కెర భూమన్న,మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టెటి మోహన్ రావు,టీమ్ జిల్లా అధ్యక్షులు సక్కి ఉదయ్,సమత వాలంటరీ ఫోర్స్ అధ్యక్షుడు గొరికంటి లింగన్న,డిక్కీ జిల్లా అధ్యక్షులు సీహెచ్ వెంకట రమణ, తెలంగాణ మాల మహానాడు యూత్ అధ్యక్షుడు కిరణ్ అనుపాల్,అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్పెట్ లింగన్న,భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు అజయ్,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్గుల్ సురేష్,ఎస్సి ఎస్టీ విద్యార్థి సంఘం తర్ల లక్ష్మణ్,గోలెం అరుణ్,అచ్చుథ్,రవి,రాము తదితరులు హాజరయ్యారు.
