Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 3:48 pm Posted by : ramakrishna

వికసిత్ భారత్ దిశగా తెలంగాణ

హైదరాబాద్, బతుకమ్మ :  నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మఅన్నా రు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందకూరు  లోని  ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ వర్మ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతోందన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వం ఉందని గవర్నర్ వెల్లడించారు. ఈసదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్  విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సదస్సు 100 ఎకరాల విస్తీర్ణంలో జరగుతోంది. ఈసదస్సుకు 44 దేశాల  నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సోమవారం, మంగళవారం  రెండు రోజులు ఈ సదస్సు జరగనుంది.

శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి : కైలాశ్ సత్యార్థి

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 20 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు. ఐకమత్యంతోపాటు శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యమని కైలాశ్ సత్యార్థి వివరించారు.

మంగళవారంతో ముగియనున్న సమ్మిట్..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్  మంగళవారంతో ముగియనుంది. ఈ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. దేశ, విదేశీ ప్రముఖులు ఈ సమ్మిట్‌కు హాజరైన నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు